కార్తీక మాసం పూర్తి అయిన తరువాతి రోజు, అంటే మార్గశీర్ష శుక్ల పక్ష పాడ్యమి తెల్లవారు ఝామున పోలిని స్వర్గంకి పంపుదామని అరటి దొన్నెలలో నదిలో / నీటిలో దీపాలు పెట్టి పూజ చేస్తారు. ఇది పెద్దల నుండి ఆచారంగా వస్తున్న కధ. పూర్వం ఓ కుటుంబంలో భక్తితో పూజలు చేస్తూ ధర్మంగా జీవనం సాగిస్తున్న కోడలు ఉండేది. ఈమె కాక ఇంకో నలుగురు పెద్ద కోడళ్ళు ఆ అత్త గారికి ఉండేవారు. వారంతా అత్తగారికి తానా తందానా అంటూ వంత పాడుతుండేవారు. పూజకి అవసరమైన వస్తువులు దూరం చేయడం, పనిఒత్తిడి పెంచి ఆరాధనకు, శివ పూజకి దూరం చేయాలి అని స్వార్ధ బుద్ధితో ఇబ్బందులకు గురిచేయడం చేసేవారు. ఈ చిన్న కోడలు మాత్రం ఎన్ని ఆటంకాలు ఎదురైనా ధృడమైన భక్తితో భావనా పూర్వకంగా తన ఇంటి పెరట్లో ఉన్న ప్రత్తి చెట్టునుండి ప్రత్తి తీసి అత్తగారికి తోడికోడళ్లకు తెలియకుండా కార్తీక మాసం మొత్తం ఉన్న దాంట్లో శివ ఆరాధన చేసి, దీపం పెడుతూ ఉన్నది. ఆఖరు రోజున ఈమె చేసిన పూజ ఫలం వలన పుష్పకవిమానం రావడం దానిలో ఎక్కడానికి పోటీ పడుతున్న ఆ నలుగురు కోడళ్ళని కాదని పరమేశ్వరుడు పోలిని స్వర్గానికి తోడ్కొని వెళ్ళాడు అని చెప్తుంటారు. ఈ కధ స్మరించి అక్షతలని శిరస్సున ధరించడం ఆనవాయితీ. తులసి పూజ చేసి , సౌభాగ్యం కోసం ప్రార్ధించి, 33 వత్తులతో దీపాలు వెలిగించాలి. అరటి దొప్పలతో బేసిసంఖ్యలో కలిపి దీపాలను ఉంచాలి. ప్రదేశాలని బట్టి ఇవి మారవచ్చు. కార్తీక మాసంలో ఏమైనా ఆటంకం వలన పూజ చేయలేని రోజులు వుండి దీపం పెట్టటం కుదరలేదని బాధపడే స్త్రీలకి ఇది ఓ ప్రత్యామ్నాయం.
గమనించవలసినది : ఏదేని భగవంతుని సేవ భక్తితో చేయడం ప్రధానం. భగవంతుఁడు భావనా మాత్ర సంపన్నుడు అని వేదాలు శాస్త్రాలు కూడా చెప్తున్నాయి . ఎంత ఆర్భాటంగా చేసాము అనే దానికన్నా, పక్కవాడికన్నా మనం ఎంత ఎక్కువగ చేయాలి లాంటి పోలికలు భక్తిని కుంచితమ్ చేస్తాయి. స్వచ్ఛమైన ఆర్తి, చేసే ఆరాధనలో శ్రద్ధ, మానవత్వంతో బహు సూక్ష్మమైన ధర్మంకోసం స్పందించే సత్వ గుణము భగవంతుని చేరడానికి సులభ మార్గాలు.
No comments:
Post a Comment